ASTHRAM DAILY
Telangana

కార్మికుల ప్రాణాలకు భరోసా ఏది?

  • పరిశ్రమల ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలి
  • ఫ్యాక్టరీస్‌ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
  • బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం: మెట్టు శ్రీధర్‌

సామాన్యుడి అస్త్రం / పటాన్ చెరు: ఫార్మా, రసాయన పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం, సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్‌ విమర్శించారు. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించాలని, సరాక, సిగాచి ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

సరాక లాబొరేటరీస్‌ ప్రధాన ద్వారం వద్ద ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్‌గోపాల్‌ యాదవ్‌, యువజన సంఘాల సమితి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రోహిత్‌సింగ్‌, మనీష్‌లతో కలిసి ఆయన నిరసన తెలిపారు. సరాకలో క్లోరోఫార్మ్‌ లీకేజీతో ఇద్దరు కార్మికులు మరణించగా, మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు.

భద్రతా లోపాలు, యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయని శ్రీధర్‌ ఆరోపించారు. ఫ్యాక్టరీస్‌ శాఖ తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయని, సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా స్పందన లేదన్నారు. డైరెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీలను తక్షణమే భర్తీ చేసి పర్యవేక్షణను బలోపేతం చేయాలని కోరారు.

సిగాచి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించినా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, బీమా మొత్తాలను కలిపి కేవలం రూ.42 లక్షలే చెల్లించారని ఆరోపించారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. సరాక మృతుల కుటుంబాలకు రూ.70 లక్షల పరిహారం హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గాయపడిన కార్మికులు వైద్య ఖర్చులు, ఉపాధిలేమితో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం, తీవ్రంగా గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం, జీవితాంతం పెన్షన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమల్లో అత్యవసర ప్రణాళికలు, ప్రమాద నివారణ నిబంధనల అమలుపై ఏటా సమగ్ర తనిఖీలు జరపాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder